
* ఓవైపు రాజకీయ రచ్చ.. మరోవైపు మహిళా సంఘాల కన్నెర్ర
* అనవసర ఖర్చు అంటున్న విపక్షం
* అభివృద్ధికి బాటలు వేస్తుందంటున్న అధికార పక్షం
* ఈ పోటీలతో రాష్ట్రానికి లాభమా? నష్టమా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ప్రపంచ 72వ అందాల పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓ వైపు ముస్తాబవుతుంటే, మరోవైపు నిరసన సెగలు కక్కుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నవేళ.. ఇటువంటి పోటీలు అవసరమా అని విపక్షం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. స్త్రీల శరీరాలను ప్రదర్శన వస్తువుగా మార్చి సామ్రాజ్యవాద మార్కెట్‌కు ప్రయోజనాలు చేకూర్చే అందాల పోటీలను వ్యతిరేకించాలని మహిళా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఓవైపు రాజకీయ రచ్చ.. మరోవైపు మహిళా సంఘాల కన్నెర్ర నేపథ్యంలో ఈ పోటీలతో తెలంగాణకు లాభమా? నష్టమా అనే చర్చ మొదలైంది.
తెలంగాణలో 10 ప్రాంతాల్లో
వచ్చే నెల 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. 3 వేల మంది ప్రపంచ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయి. దీనికోసం హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన 8 ఈవెంట్లు తెలంగాణలోని పోచంపల్లి, యాదగిరిగుట్ట,రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరగనున్నాయి. ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి వేదికగా మలుచుకుంటామని పర్యాటక శాఖ చెబుతోంది.
ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలా?
రైతు ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే అందాలాపోటీలా? అని కేటీఆర్ పలుమార్లు విమర్శిస్తూ వస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో పెట్టడం వల్ల రాష్ర్టానికి కలిగే లాభం ఏమిటని ప్రశ్నించారు. ‘రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలు పెడతారా? మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉన్నది అందాల పోటీల కథ’ అని ఎద్దేవా చేశారు. రూ.46 కోట్లతో ఫార్ములా ఈ-రేసుతో రాష్ర్టానికి పెట్టుబడులు వస్తాయని చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఇదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు కానీ.. అందాల పోటీలకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ ఉందంటూనే ఇటువంటి వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు.
మీకెందుకయ్యా కడుపుమంట!
అందాల పోటీల నిర్వహణపై విపక్షాల విసుర్లపై అధికార పక్షం కూడా దీటుగానే జవాబు ఇస్తోంది. ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అందాల పోటీలు నిర్వహిస్తుంటే మీకెందుకయ్య కేటీఆర్ అని ప్రశ్నించారు. అభివృద్ధికి విఘాతంగా మారుతున్నారని అన్నారు. ఈ పోటీలతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, 140 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు వస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ బీఆర్ ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అందాల పోటీలతో పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, చిల్లర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ రచ్చకు కాదేదీ అనర్హం అన్నట్లుగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల మంటలకు అందాల పోటీలు కూడా కారణంగా మారడం చర్చనీయాంశం అవుతోంది.
అందాల పోటీలను వ్యతిరేకిద్దాం..
ఒకవైపు ఈ పోటీల చుట్టూ రాజకీయ రచ్చ రేగుతుంటే, మహిళా సంఘాలు సైతం ఈ పోటీలను వ్యతిరేకించాలని పిలుపునిస్తున్నాయి. 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిని రద్దు చేసేవరకు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనల మధ్యే ఈ పోటీలు జరుగుతున్నాయని, 1996లో బెంగళూరులో ఈ పోటీలను నిర్వహించినప్పుడు కూడా నిరసనలు హోరెత్తాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే పోటీలు పర్యాటకంగా తెలంగాణను ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదం చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడంపై ఆమె మండిపడ్డారు. ఐద్వా, ఎఫ్ ఎస్డబ్ల్యూ వంటి మహిళా సంఘాలు, పలువురు రచయిత్రులు సైతం సమావేశంలో పాల్గొని అందాల పోటీలకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. ఈక్రమంలో పోటీల నిర్వహణ ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.
………………………………