* మళ్లీ గంజాయి అమ్మకాలు.. పోలీసుల సోదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన నీతూబాయి ఇంట్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయితో పాటు బీర్లు, బ్రీజర్లు, నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌రామ్‌గూడలో గత కొన్నేళ్లుగా గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతూబాయ్.. మళ్లీ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు పర్యవేక్షణలో సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు తన సిబ్బందితో కలిసి నీతూబాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆమె ఇంట్లో 786 గ్రాముల గంజాయి, 110 బీర్లు, కొన్ని బ్రీజర్లు, గంజాయి విక్రయించగా వచ్చిన నగదు రూ. 60,890లు దొరికాయి. దాంతో పోలీసులు నీతూబాయ్ కుమారుడు దుర్గాప్రసాద్, గోవింద్, దుర్గేష్‌లను అరెస్టు చేశారు. ఒడిషా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
…………………………………………….
