* జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐఐటీ రామయ్య, ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన చుక్కా రామయ్య నేడు వందో జన్మదినాన్ని జరుపుకున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులను ఐఐటీ మెట్లు ఎక్కించిన ఆయనకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యానగర్‌లోని చుక్కారామయ్య నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన ఆయన 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అన్నారు. ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కా రామయ్యదే అని పేర్కొన్నారు.
నిత్య విద్యార్థి
నిత్య విద్యార్థి, వేల మంది ఇంజినీర్ల సృష్టికర్త చుక్కా రామయ్య సామాజిక సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా మన తరానికి ఒక స్ఫూర్తిప్రదాత. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ నేపథ్యం ఆయన సొంతం. అంటరానితనం నిర్మూలన ఉద్యమంలో పాల్గొని.. తన సొంత బ్రాహ్మణ సమాజం నుంచే వెలివేయబడిన సామాజిక సంస్కర్త ఐఐటీ రామయ్య. అంతటి మహోన్నత వ్యక్తి పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ ఆరోగ్యం విషయంలో ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించి నేడు శతకంలోకి అడుగుపెట్టారు.పేద విద్యార్థులను ఐఐటీ మెట్లెక్కించిన విద్యావేత్త: తెలంగాణ గడ్డపై జన్మించి వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులను అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీ మెట్లెక్కించిన దిగ్గజ విద్యావేత్త చుక్కా రామయ్య.1925 నవంబర్ 20న జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించారు.
ఐఐటీ రామయ్యగా..
చుక్కా రామయ్య ఇంటి పేరు ఐఐటీగా మారడం వెనుక ఓ కథ దాగుంది. 1983లో నాగార్జున సాగర్‌లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన కుమార్తె ఐఐటీ ప్రవేశాల సందర్భంగా ఒక వాస్తవాన్ని గుర్తించారు. దేశంలో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అతి తక్కువ సంఖ్యలో ఉండటం చూసి చలించిపోయారు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా తానే ఐఐటీ శిక్షణను ప్రారంభించాలని దృఢ సంకల్పం ఏర్పరుచుకున్నారు. దీంతో తెలుగు విద్యార్థులను ఐఐటీలకు పంపి అత్యున్నత సాంకేతిక విద్యను చేరువ చేశారు. దీంతో చుక్కా రామయ్య కాస్త ఐఐటీ రామయ్యగా కీర్తి పొందారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు.
……………………………………………
