
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
ఆకేరున్యూస్, వరంగల్: భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. రైతులకు భూ భారతి చట్టం శ్రీరామరక్ష అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ భారతి – 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా మంగళవారం వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారత్ చట్టం అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్‌గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకు వచ్చామని అన్నారు. రైతుల వారసత్వంగా వచ్చే భూమిలో అనుభవించలేక అనేక సమస్యలు ఏర్పడ్డ ఈ ధరణి నుంచి చిన్న చిన్న సమస్యలు మార్చుకొనుటకు ప్రతిదీ కోర్టు ద్వారా పరిష్కరించుటకై నిరుపేద రైతులకు సాధ్యం కాలేదని, కానీ ప్రస్తుతం ఉన్న ప్రజా పాలన ప్రభుత్వ రైతు శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుటకు రెండంచల వ్యవస్థను తీసుకువచ్చి రైతులకు అండగా నిలిచిందని అన్నారు. భూ భారతి చట్టం రైతుల పాలిట భద్రత నేస్తం అని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన చట్టాన్ని అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు.
రైతులకు భూ భారతి వరం…
మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఆత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు. రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..