* సొంత పార్టీలోనూ అసంతృప్తి
* ప్రతిపక్షాలదీ అదే తీరు
* కమిషనర్‌కు బీజేపీ ఫిర్యాదు
* వెల్లువలా అభ్యంతరాలు
* అంతిమ రూపు ఎలా ఉండేనో?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సర్కారు మహ మహా నగర రూపకల్పనకు బీజం వేసింది. 150 వార్డులు గల జీహెచ్ఎంసీని 300 వార్డులు(డివిజన్లు)గా విభజిస్తూ విస్తరించింది. తెలంగాణ గెజిట్‌లో పునర్విభజన ముసాయిదాను పొందుపరిచారు. వార్డుల వారీగా సరిహద్దుల వివరాలను సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. అంతేకాదు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ఠీఠీఠీ.జజిఝఛి.జౌఠి.జీుఽలో కూడా వివరాలు అందుబాటులో ఉంచారు.
అభ్యంతరాల వెల్లువ
విస్తరిత గ్రేటర్ పరిధిలో ఉన్న వారు పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని కోరారు. నోటిఫికేషన్ ప్రచురించబడిన ఏడు రోజుల్లోపు (16వ తేదీ వరకు) సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల్లో తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. ఈమేరకు రెండు రోజులుగా పౌరులు, నేతలు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 320 అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన విభజన తీరుపై ఆ పార్టీకి చెందిన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం. రాజకీయ పార్టీలే కాకుండా కాలనీ సంఘాలు, కొందరు వ్యక్తులు బల్దియా ప్రధాన, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అభ్యంతరాలు, సూచనలు సమర్పిస్తున్నారు. పలు డివిజన్ల విభజన సహజ సరిహద్దులకు భిన్నంగా జరిగిందని చెబుతున్నారు.
ఇదేం విభజన తీరు
డివిజన్ల పునర్విభజనపై చాలా ప్రాంతాల్లో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఖైరతాబాద్ డివిజన్‌ను రెండు ముక్కలు చేసి కొత్తగా ఎర్రమంజిల్ డివిజన్ ఏర్పాటు చేశారు. పంజాగుట్టను ఖైరతాబాద్ నుంచి విడదీసి ఎర్రమంజిల్ డివిజన్లో చేర్చారు. పునర్విభజనలో ఖైరతాబాద్ డివిజన్ రెండు నియోజకవర్గాలు, రెండు మండలాల్లో కొంత చొప్పున విడగొట్టారు. కొత్తగా చేరిన గన్‌ఫౌండ్రీ డివిజన్ ప్రాంతం నాంపల్లి మండల పరిధిలోకి వస్తోంది. ఒక్క డివిజన్‌ను రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు వచ్చేలా విభజన చేయడంపై కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేం విభజన తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మజ్లిస్‌కు అనుకూలంగా పునర్విభజన
మరోవైపు బీజేపీ కూడా పునర్విభజనపై పెదవి విరుస్తోంది. సరిహద్దుల గుర్తింపులో గందరగోళం నెలకొందని, పాతబస్తీలో మజ్లిస్‌కు అనుకూలంగా పునర్విభజన జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను నిన్న (గురువారం) ఆ పార్టీ ప్రతినిధులు మర్రి శశిధర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బండ కార్తీకరెడ్డి తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే ఎంఐఎం కూడా ఇప్పటికే పునర్విభజనపై కమిషనర్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు డివిజన్లలో సరిహద్దుల గుర్తింపును సరి చేయాలని కోరింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు మరో ఐదు రోజులు గడువు ఉంది. ఈలోపు ఇంకెన్ని వస్తాయో, వాటిలో వేటినైనా పరిగణనలోకి తీసుకుంటే విస్తరిత జీహెచ్ఎంసీ అంతిమ రూపు ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది.
…………………………………………….
