* గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్
* సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్ట్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హై కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హై కోర్టు గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది, దీంతో గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు టీజీ పీఎస్సీ,ప్రభుత్వానికి కూడా ఊరట లభించినట్లయింది. వివరాల్లోకి వెళితే గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఈ పరీక్షలను రద్దుచేయాలంటూ కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఈ కేసుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 పరీక్షా పేపర్లను రీ వాల్యూయేషన్ చేయాలని అది సాధ్యం కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని తీర్పును వెలువరించింది. ఈ తీర్పు పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అశనిపాతంలో అయింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది.దీనికి తోడు గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తమకు అన్యాయం చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరిని శిక్షించడం ఎంత వరకు న్యాయం అంటూ కోర్టు కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తుది తీర్పును వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి గ్రూప్ 1 నియామకాలు యధావిధంగా కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రూప్ 1 లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు,టీజీపీఎస్కు అటు ప్రభుత్వానికి ఊరట లభించింది.
……………………………………….
