
* 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
ఆకేరున్యూస్, అమరావతి: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా.. వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేని శ్రీనివాస్‌ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావును మంగళవారం ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తరలించారు. ఏపీ రాజధానిపై, రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో రాజధాని ప్రాంతం మహిళగా ఉన్న తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాలు కొమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కృష్ణం రాజు, ఏ2గా కొమ్మినేని శ్రీనివాస్ రావు, ఏ3గా సాక్షా యాజమాన్యాన్ని చేర్చారు. కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో ఏ2 కొమ్మినేని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సాయంత్రానికి గుంటూరుకు తీసుకొచ్చారు. గత రాత్రి మొత్తం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపిన పోలీసులు మంగళవారం ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపర్చారు. ఫిర్యాదుదారు శిరీష కూడా తన న్యాయవాదులతో వచ్చి జడ్జి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారనే అంశంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కులపరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని వైసీపీ తరపు న్యాయవాదులు వాదించినట్లు- తెలుస్తోంది. అనంతరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు జర్నలిస్టు కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
……………………………………………..