* ఆరుగురు దుర్మరణం.. ఆస్పత్రుల వద్ద భక్తుల హాహాకారాలు
* గాయపడ్డ వారికి కొనసాగుతున్న చికిత్స
* డీఎస్సీ గేట్లు తీయడంతోనే ప్రమాదం : ఈవో
* మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
* తిరుపతికి సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుపతి ఏడుకొండల స్వామి సన్నిధిలో చోటుచేసుకున్న పెను విషాదం కోట్లాది మంది భక్తులను కలచివేస్తోంది. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారు తిరుపతి(TIRUPATHI)లో రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, బాధిత కుటుంబాల సభ్యులతో ఆస్పత్రుల వద్ద హాహకారాలు మిన్నంటాయి. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులొస్తారని తెలిసీకూడా, అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని, డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని టీటీడీ ఈవో శ్యామలారావు (TTD EO Shyamalarao) వెల్లడించారు.
చనిపోయిన వారు వీరే..
తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. విశాఖపట్టణంకు చెందిన రజనీ (47), శాంతి (34), లావణ్య (40), నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు (51), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 20 మంది డిశార్జి అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు తిరుపతికి చేరుకున్నారు.
…………………………………………………………