* సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం
* బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం
* మూడు విడతలుగా నిర్వహించే అవకాశం
*నవంబర్ 22 తో ముగియనున్న బీహార్ అసెంబ్లీ గడువు
* ఇప్పటికే వేడెక్కిన బీహార్ రాజకీయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మరికొద్ది గంటల్లో మ్రోగే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు.243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగగా.. అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించింది.
కొత్త విధానానికి శ్రీకారం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచే అవకాశం ఉంది.ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం తీసుకొచ్చిన 17 సంస్కరణలను బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనుంది. వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని, ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయి. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బీహార్లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరుగనున్నాయి.
అసెంబ్లీలో బలాబలాలు
బీహార్ లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా ఎన్డీయే కూటమికి 138 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 84,జేడీయూ 48,హెచ్ ఏ ఎం 4,ఇండిపెండెంట్లు 2
ప్రతిపక్షం ఇండియా కూటమికి 103 స్థానాలు ఉన్నాయి.ఇందులో ఆర్జేడీ 71, కాంగ్రెస్ 17,సీపీఐఎంఎల్ లిబరేషన్ 11,సీపీఎం 2, సీపీఐ 2 స్థానాలు ఉన్నాయి. వీరు కాకుండా ఎంఐఎం 1,ఇతర ఇండిపెండెంట్ 1.
…………………………………………..
