ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం మొండివైఖరి…
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభం, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విద్యార్థుల ఆత్మహత్యలు – ప్రభుత్వ నిర్లక్ష్యం…
సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ అందక, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘చీమ కుట్టినట్టు కూడా లేదని’ విమర్శించారు. “మనిషికి ప్రాణం విలువ తెలుస్తుంది, బాధ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మానవత్వం కోల్పోయి బండరాయిలా మారింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో సమస్యలు ప్రస్తావిస్తే కనీసం పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉండేదని, కానీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలు మొత్తుకున్నా, అఖిలపక్షాలు గళమెత్తినా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు.
భూ కుంభకోణాలు – ల్యాండ్ మాఫియా ఆరోపణలు!!
ప్రభుత్వం నిధుల లేమి సాకుతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని, కానీ మరోవైపు వేల కోట్ల విలువైన భూములను ల్యాండ్ మాఫియాకు కట్టబెడుతోందని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. సుమారు రూ. 7,000 కోట్ల విలువైన ఎల్లమ్మ బండ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొల్యూడ్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 9,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బ్రోకర్లకు భూములు కట్టబెట్టకుండా ఆ నిధులతో విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
హైడ్రా (HYDRAA) తీరుపై విమర్శలు!!
హైడ్రా వ్యవస్థ పేదల పాలిట శాపంగా మారిందని ఈటల మండిపడ్డారు. “హైడ్రా వస్తే ల్యాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడతాయని భావించాం. కానీ ఇది ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తోంది.” గాజులరామారం సర్వే నెం. 7లో 40 గజాల్లో గుడిసెలు వేసుకున్న పేదల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం, ల్యాండ్ మాఫియా చేతిలో ఉన్న వందల ఎకరాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చి రూ. 15,000 కోట్ల భూమిని కాపాడామని ప్రకటనలు ఇచ్చుకోవడం నిస్సిగ్గు చర్య అని అభివర్ణించారు.
ఆర్థిక అరాచకం – కేంద్రీకృత అధికారం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగడం లేదని, అధికారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) వద్దే కేంద్రీకృతమైందని ఈటల పేర్కొన్నారు. రూ. 1.5 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన, రూ. 5,000 కోట్లతో గాంధీ విగ్రహాల ఏర్పాటుకు నిధులు ఉంటాయి కానీ, విద్యార్థుల చదువులకు నిధులు ఉండవా? అని నిలదీశారు.
ఐఏఎస్ అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీలు తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేయడం దురదృష్టకరమని, కేవలం పోస్టింగుల కోసం పాలకులు చెప్పినట్లు బానిసల్లా పనిచేయడం జుగుప్సాకరమని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదని, కాంట్రాక్టు పనులు చేసిన వారు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల గుర్తు చేశారు. ప్రభుత్వం కేవలం ఢిల్లీకి నిధులు పంపే ఏజెంట్లా మారిందని ఆరోపించారు. “పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ సమాజానికి మాయ చేయడం రాదు, బరిగిసి కొట్లాడటం తెలుసు. ప్రజలు కన్నెర్ర చేసి, కర్రు కాల్చి వాత పెట్టే వరకు ఈ ప్రభుత్వం మారదు” అని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కేవలం కాలేజీ యాజమాన్యాల సమస్య కాదని, లక్షలాది మంది తల్లిదండ్రుల వేదన అని పేర్కొంటూ.. ఈ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈటల రాజేందర్ ప్రకటించారు.
