
* తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం కేసీఆర్ కృషి
* ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే రైతులకు శ్రీరామ రక్ష
* రేవంత్‌కు ప్రశ్నల వర్షం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిందలు, దందాలు, చందాలు.. ఇదే కాంగ్రెస్ పాలన అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR) విమర్శించారు. తెలంగాణ రైతులకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని అన్నారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం(KALESWARAM)పై తెలంగాణ భవన్లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలని, అందుకే పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసిందని వివరించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినా, సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కారం నిరంతరం పనిచేసిందన్నారు. కానీ నేడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షిక ఎక్కడో పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీ(RAHUL GANDHI)కి చందాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని అన్నారు. గుజరాత్లో మార్బీ అనే ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోయినా ఎవరూ మాట్లాడరని, కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్లు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ (NDSA) రిపోర్టును వారి పార్టీ ఆఫీసులో తయారు చేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీని కట్టిన సంస్థ పనికిరానిదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అదే సంస్థతో ఎందుకు కట్టించావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వాస్తవాలు తెలియజెప్పడానికి, కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై నీళ్లిచ్చిన కేసీఆర్ మీద, నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వంపైన అభాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన పనిని కావాలని అపవాదులు వచ్చేవిధంగా అనుమానాలు కలిగేలా ప్రచారం చేస్తున్నరు, వాస్తవాలు చెప్పాలని కోరారు. గోదావరి జలాల విషయంలో ఏపీ అనుమతుల్లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడు అన్నారు. బీజేపీ(BJP) కేంద్ర మంత్రులు మాట్లాడరు, కాంగ్రెస్ బీజేపీ వాళ్లు నోరు తెరవరు అని ప్రశ్నల వర్షం కురిపించారు.
………………………………………………….