Boggula Srinivas - File photo - accident Photo
* పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్పద మృతి
ఆకేరు న్యూస్, ఖమ్మం : పవన్ కళ్యాణ్ హఠావో- పాలిటిక్స్ బచావో పుస్తక రచయిత డాక్టర్ బొగ్గుల శ్రీనివాస్ ( 49 ) మృతి చెందారు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్ లో కి దూసుకెళ్లింది .కారు వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ జలసమాధి అయ్యారు.ఈ ప్రమాదం లో డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో పాటు అక్కడి నుంచి పరారు కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని శ్రీనివాస్ మిత్రులు అంటున్నారు.
* చంపేశారా..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా రిజర్వాయర్ వైపు దూసుకుపోయింది. కారు పూర్తిగా నీట మునగడంతో వెనుక సీట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాన్ని బయటకు తీశారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడం, వెనుక సీట్లో ఉన్న వ్యక్తి మరణించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన రాసిన పవన్ కల్యాణ్ హటావో – పాలిటిక్స్ బచావో అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. లక్షల్లో ప్రతులు అమ్ముడు పోయాయి.ఈ పుస్తకం విడుదల సమయంలో ఆయనకు చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో, అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక రక్షణ కూడా కల్పించింది మృతి చెందిన బొగ్గుల శ్రీనివాస్ తెలుగు సాహిత్య , రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.1977, మార్చి 5న కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో జన్మించారు. ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసిన ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ కావడంతో అటువైపు ఎక్కువ దృష్టి సారించారు.జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలపై సమగ్ర పరిశోధన చేసి, వారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
*పోలీసుల దర్యాప్తు
గతంలో రాజకీయంగా సంచలనం సృష్టించిన వ్యక్తి కావడంతో, ఈ ప్రమాదం వెనుక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నే జరిగిందా?ప్రమాదం నుంచి డ్రైవర్ ఎలా తప్పించుకున్నారు అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ పట్టుబడితేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
————–
