
* ధూమ్‌ధామ్.. జాతర చేద్దాం..
* నేడు మహా బోనాలకు నగరం సిద్ధం
* బోనమెత్తనున్న మహానగరం
* గల్లీ నుంచి గోల్కొండ వరకు..
* నేడే మహా జాతర
* లాల్ దర్వాజా బోనాలు.. రేపు ఘటాల ఊరేగింపు
* బోనాలకు ఎంతో విశిష్ఠత
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాజధాని భాగ్యనగరం.. నేడు మహాబోనాలకు సిద్ధమైంది. ఊరువాడా పూనకాలతో ఊగిపోనుంది. బోనాల జాతరలో భాగంగా నేడు గల్లీ నుంచి గోల్కొండ వరకూ బోనాలతో శోభాయమానంగా వెలుగొందనుంది. బోనం సంస్కృతిలో భాగమని, ఆషాఢ మాసంలో బోనాల జాతర చారిత్రక గోల్కొండ కోటపై నెలకొన్న ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో మొదటి పూజతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం, బోనాల పండుగ జూన్ 29 నుండి ప్రారంభమై జూలై 20 వరకు ఉంటుంది. నేడు లాల్ దర్వాజా బోనాలు జరుపుకుంటారు. రేపు ఘటాల ఊరేగింపు ఉంటుంది.
బోనాలకు ఎంతో విశిష్ఠత
ఈ బోనాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఆషాఢ మాసం బోనాల పండగ అంటే గ్రామదేవత పూజించేది. బోనం అంటే భోజనం. దీన్ని కొత్త కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగిస్తారు. గొర్రెపోతు మెడలో వేప మండలు కట్టి పసుపు కలిసిన నీరు చల్లుతూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి బోనం సమర్పిస్తారు. బోనాల సమర్పణ వల్ల అమ్మవారు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం.
రాష్ట్ర పండుగగా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల జాతరను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారు. బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు అన్నంతోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో చేసిన బోనాన్ని మట్టి, ఇత్తడి లేక రాగి కుండలలో పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. బోనం తీసుకెళ్లే కుండలను వేప రెమ్మలు, పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లుగల గ్రామ దేవతల ఆలయాలను అందంగా అలంకరిస్తారు.
అమ్మవారు తమ ఇంటికి వచ్చిందని..
ఆషాఢ మాసంలో బోనాల జాతర సందర్భంగా అమ్మవారు పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అమ్మవారు తమ ఇంటికి వచ్చిందన్న భావనతో భక్తులు బోనాలతో నైవేద్యం సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండగ వంటి పేర్లతో పిలుస్తారు. కాలక్రమేణా బోనాలుగా మారింది. ఈ సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. పూర్వ కాలంలో ఈ పండగ రోజున దుష్టశక్తులను పారదోలడానికి ఆలయ ప్రాంగణంలో దున్నపోతును బలిచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
పోతురాజుల హంగామా..
అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు వేషధారి గంభీరంగా, బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కట్టి, ఎర్ర దోతీ ధరించి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఫలహారపు బండి ఎదుట నాట్యం చేస్తాడు. అతడు పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా బావించబడతాడు. వేపాకులను నడుముకు చుట్టుకొని, కొరడాతో బాదుకుంటూ భక్తులను ఆలయంలోని అమ్మవారి వద్దకు తీసుకెళతాడు. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. నేడు నగరమంతా బోనమెత్తనుంది.
……………………………………………………..