
*ఏజెన్సీలో మృత్యుకుహరాలుగా మూలమలుపులు
* కాన రాని సూచిక బోర్డులు
* ప్రమాదాల బారిన ప్రజలు
*పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఆకేరు న్యూస్ ములుగుః ఏజెన్సీలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై మూలమలుపుల ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రమాదాలకు నిలయంగా మారాయి. మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో దగ్గరికి వచ్చే వరకు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాటాపురం, బీరెల్లి, రంగాపురం గోవిందరావుపేట మండలం పసర నుంచి ఒడ్డుగూడెం, కొడిశాల, లింగాల గుండాల వైపు నిత్యం వందలాది ద్విచక్రవాహనాలు, ఇసుక లారీలు పలు రకాల భారీ వాహనాలు వెళ్తుంటాయి . ఈ రహదారులపై బయ్యారం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ ,సత్తుపల్లి, ఖమ్మం, ఇల్లందు తదితర సుదూర ప్రాంతాల నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ వాహనాల్లో కాటాపూర్, లింగాల గుండాల మీదుగా మేడారం తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కాగా కాటాపూర్ మీదుగా బీరెల్లి రంగాపూర్ వరకు సుమారు 33 మూలమలుపులు ఉన్నాయి. దీనితోపాటు పసర నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో గల గుండాల మండలం వరకు సుమారు 70 మూలమలుపులు ఉన్నాయి .ఈ మలుపుల వద్ద నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి .అయినప్పటికీ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి .ఇటీవల కాటాపూర్ తాడ్వాయి మార్గమధ్యలో పసర లింగాల మార్గమధ్యలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ప్రమాదానికి మృత్యువాత పాలైన సంఘటనలు అనేక ఉన్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఆర్టిసి బస్సు అడవిలోకి దూసుకెళ్ళింది. లింగాల ఒడ్డుగూడెం మార్గ మధ్యలో వాహనాలు బోల్తా పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి . గతంలో సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు వాహనదారులు నెమ్మదిగా వెళ్లేవారు. ప్రస్తుతం కాటా పూర్ లింగాల గుండాల వైపు డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు రద్దీ ఎక్కువ అవుతోంది. దీనితో అనేక ప్రమాదాలకు ఈ దారులు కారణంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద సూచికబోర్డలు ఏర్పాటు సి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
…………………………………………..