* ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు
* బస్సు ఎక్కాలంటే భయం.. భయం
* గత్యంతరం లేక ప్రయాణాలు
ఆకేరు న్యూస్, స్సెషల్ స్టోరీ
కర్నూలు జిల్లా ఘటన ట్రావెల్స్ బస్సుల్లోని లోపాలను మరోసారి ఎత్తిచూపింది. అక్కడ ప్రమాదం జరిగింది.. బస్సును బైకును ఢీకొట్టడం వల్లే అయినా.. తీవ్రత పెరిగింది మాత్రం నిబంధనల ఉల్లంఘనల వల్లేనని స్పష్టం అవుతోంది. సీటింగ్ కు అనుమతి తీసుకుని స్లీపర్లుగా మార్చడం, ఎగసిపడుతున్న నిప్పురవ్వలను ఆర్పే పరికరాలు బస్సులో లేకపోవడం వంటి ఘటనలతో తీవ్రత పెరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు మంటల్లో మాడిపోయాయి. సీట్లలో పడుకున్నవారు పడుకున్నట్లే అస్తిపంజరాలుగా మారిపోయారు. మరికొందరు మాంసపు ముద్దలుగా మిగిలారు. ఎవరు ఏంటో గుర్తుపట్టలేనంతగా మాడి మసైపోయారు.
భయం.. భయంగా
పెళ్లి వేడుకలు, బంధువుల ఇళ్లకు, పండగ ప్రయాణాల కోసం బస్సులు ఎక్కుతున్న వారు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. వరుస ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కర్నూలు ఘటనతో మరోసారి ‘ప్రైవేట్ ట్రావెల్స్’పై చర్చ మొదలైంది. రోడ్ ఇంజినీరింగ్, బస్డిజైన్కు సంబంధించి లోపం ఉండటం వల్లే గతంలో పాలెం బస్సు ప్రమాదం జరిగిందని, కర్నూల్ ఘటనలో కూడా ఇదే తరహా ఉండి ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూసేందుకు ఆకర్షణీయంగా, రంగురంగుల్లో మెరిసే బస్సుల్లో కనీస అగ్నిమాపక పరికరాలు ఉండడం లేదు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి, బయటపడేందుకు అనువైన అవకాలు లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.
డిజైనింగ్‌లో లోపాలే.. ప్రయాణికులకు శాపాలు
ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్టం, అలాగే బెంగళూరు మార్గంలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. రైలు టికెట్ల దొరకడం ఇబ్బందికరంగా మారడంతో ప్రయాణికులు బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాలు మాత్రం సంపాదనపై పెట్టే ఆసక్తి వాటి నిర్వహణ విషయంలో చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా ప్రైవేట్ బస్సుల యాజమానులు చెలరేగిపోతున్నారు. అక్టోబరు 30 2013 న బెంగళూరు నుంచి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ బస్సు ఒక కారును ఓవర్‌టేకింగ్ చేస్తూ ఒక కల్వర్టును ఢీ కొని ఘర్షణ వలన అగ్ని ప్రమాదానికి సంభవించింది. ప్రమాదంలో 45 మంది మరణించారు. సీఐడీ విచారణలో వోల్వో బస్సుల తయారీలోనే లోపాలున్నాయని పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చారని రిపోర్టులో పేర్కొంది. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని నిర్థారించింది. ఈ డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచడం, బస్సులో ఓవర్ లోడ్ లగేజీ, ప్రమాదకర వస్తువులు తదితరాలు ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఇప్పుడు కర్నూలు ఘటనలోనూ బస్సు డిజైనింగ్ లోపాలు బయటపడ్డాయి.
ఆ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకంటే..?
స్లీపర్ బస్సుల నిర్మాణ విధానం భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో సాధారణంగా 2×1 సీటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒకసారి 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించవచ్చు. బెర్త్‌ల పొడవు సుమారు 6 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు మాత్రమే ఉంటుంది. అయితే ఈ బస్సుల్లో కేవలం స్లీపర్ సీట్లు మాత్రమే ఉండడంతో బస్సు మధ్యలో ఉండే స్థలం చాలా ఇరుకుగా ఉంటుంది. లావుగా ఉండే ఒక వ్యక్తి కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు అంత సులభంగా వచ్చేందుకు అవకాశం ఉండడం లేదు. బస్సు లోపలి నిర్మాణం సౌకర్యవంతంగా ఉన్నా, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరైన ప్రదేశాల్లో లేకపోవడం, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం వంటి అంశాలు మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.
…………………………………………………..
