
* ఆఫీసులోనే రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం
* రిటైర్మెంట్కు 3 వారాల ముందు మళ్లీ జైలుకు
ఆకేరు న్యూస్, అమరావతి : మనిషిని డబ్బు శాసిస్తున్నదా.. మనిషి డబ్బును శాసిస్తున్నాడో చెప్పలేని పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది. భూమి, డబ్బు ఎల్లకాలం ఉంటుంది.. మనిషి జీవితం క్షణకాల బొంగరం.. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియకున్నా.. ఎల్లకాలం ఉండే డబ్బు, భూమి లాంటి స్థిరాస్తులపై మక్కువ.. అయితే ఇంకేముందీ.. మనిషికి కావలసింది మంచితనం కాదు.. మనీయే అంటూ మానవత్వం, మంచి, మనస్సు ను చంపుకొని మనీ చుట్టూ తిరుగుతోంది నేటి సమాజంలోని మనుషులలో.. అంటే అందరూ అని కాదు.. మంచిని, మానవత్వాన్ని, దాతృత్వ స్వభావంతో నడుచుకునే వారి సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయికి మనుషుల నైజం మారింది. అందుకు నిదర్శనం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు. తాజాగా ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా రూ. 5 కోట్ల లంచాన్ని డిమాండ్ చేసి, రూ.25 లక్షలు టోకెన్ నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటనే నిదర్శనం. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంనకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్సీగా పని చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన శ్రీసత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత సీహెచ్ కృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్టును దక్కించుకున్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మించగా, ఒక్కో భవనం అంచనా వ్యయం రూ.12 కోట్లు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.15 కోట్లకు చేరింది. వీటికి సంబంధించి కృష్ణంరాజుకు రూ.35.50 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నాయి.. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా శ్రీనివాస్ ఏదోలా కొర్రీలు పెడుతూ కొద్దిరోజుల కిందట మనసులోని మాటను బయట్టి, రూ.35.50 కోట్ల బిల్లులు చేయాలంటే రూ.5 కోట్లు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. ముందుగా రూ.25లక్షలు ఇవ్వాలని షరతు విధించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణంరాజు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ ఫోన్లో బాధిత కాంట్రాక్టరుకు నేరుగా ఆఫీసులోకి తీసుకొచ్చి లంచం ఇవ్వమని చెప్పారు. కృష్ణంరాజు తన స్నేహితుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకుని బ్యాగ్‌లో పెట్టి శ్రీనివాస్‌కు అందజేశారు. ఆయన ఈఎన్సీ చాంబర్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు భాస్కరరావు, నాగరాజు శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి జైలుకు తరలించారు. కాగా, ఈఎన్సీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఇది మూడోసారి. 2001లో విశాఖపట్నం ఎస్ఈ కార్యాలయంలో ఏఈగా మొదటిసారి, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2014లో రెండో దఫా ఏసీబీకి పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా మరో మూడు వారాల్లో శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.
………………………………….