*సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తల్లకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలంటూ రేవంత్‌రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు.
*16,978 ఉద్యోగాలే..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రైతులు సహా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ.. నిరుద్యోగులను దగా చేసిందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు.
*డీలిమిటేషన్ బీఆర్ఎస్కే మేలు
డీలిమిటేషన్ వల్ల బీఆర్ఎస్కే మేలు జరుగుతుంది.. మహిళా రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తుందని హరీష్‌రావు పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారా లేదా అనే విషయంపై స్పందిస్తూ.. అది చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందని అన్నారు.
