BRS Leader Lakshman babu
* 420 హామీల అమలుపై లెక్క చెప్పాలి
– కాకులమర్రి లక్ష్మణ్‌బాబు
ఆకేరు న్యూస్, ములుగు: ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆదేశాలు, కేటీఆర్ పిలుపు, హరీశ్‌రావు సూచనల మేరకు చేపడుతున్న వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏటూరునాగారంలో మూడో రోజు బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఓడవాడ హనుమాన్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి బస్టాండ్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈసందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేసిందో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, యువతకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు, విదేశీ విద్య, విదేశాలకు వెళ్లే వారికి రూ.25 లక్షల రుణం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు తాము ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. రైతుబంధు, రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఉందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మించేందుకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సరికాదన్నారు. రైతులు, మహిళలు, యువత, పేదలు, దివ్యాంగుల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం వాటిపై సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఏటూరునాగారం అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని లక్ష్మణ్‌బాబు అన్నారు. ఏటూరునాగారం బస్‌డిపో విషయంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు కట్టారా?’’ అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత బస్‌డిపో ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. గోదావరి కరకట్ట నిర్మాణం పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం గోదావరి వెంట పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
