* సర్ధార్ వల్లభాయి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
* యువతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు
* సౌదీ అరేబియా బస్సు ఘోర ప్రమాదంపట్ల దిగ్బ్రాంతి
* కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
* వేలాది మంది యువత, విద్యార్థులతో కలిసి బండి సంజయ్ పాదయాత్ర
ఆకేరు న్యూస్, కరీంనగర్ : నవ భారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల నుండి నిర్వహించిన పాదయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, యువత హాజరై సంజయ్ తోపాటు నడిచారు. వారందరితో కలిసి పాదయాత్ర చేస్తూ బండి సంజయ్ ముందుకు సాగారు. అంతకుముందు పాదయాత్ర ఆరంభంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
భారత దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్. దేశంలోని 560 సంస్థానాలను ఒకే జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు. పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదు. తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసిండు. ఒకవేళ తెలంగాణ భారత్ లో విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించండి. మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. ఇది ఆనాడే గ్రహించిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని ప్రకటించి ‘ఆపరేషన్ పోలో’ (అంటే పోలీస్ యాక్షన్) పేరుతో నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడు. దేశంలో ఆధునిక సివిల్ సర్వీసెస్ (IAS, IPS) వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. క్రమశిక్షణ, నిష్ఠ, ధైర్యం, పరిపాలనా దీక్షత ఆయనకున్న ప్రధాన లక్షణాలు. అలాంటి మహనీయుడిని 150 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా, ఆయన సిద్దాంతాలను కొనసాగించాలనే మహత్తర ఆశయంతో ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలో విద్యార్థులను, యువతతో కలిసి ఎంపీలు, కేంద్ర మంత్రులు పాదయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ లో ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ పేరిట జరిగే పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సర్దార్ పటేల్ ఈ కార్యక్రమాలకు విస్త్రత ప్రచారం కల్పించి యువతలో ఐక్యతా స్పూర్తిని నింపాలని మీడియాను, సోషల్ మీడియా వారియర్స్ ను కోరుతున్నా. దేశం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, విమర్శలు వచ్చినా వెనకడుగు వేయకుండా కఠిన నిర్ణయం తీసుకునే గుండె ధైర్యం పటేల్ సొంతం. దేశం ఫస్ట్…. ఆ తరువాత వ్యక్తిగతం అనేది ఆయన తత్వం. నేటి యువతకు పటేల్ స్పూర్తిదాయకం. ఆయనలోని ఆలోచనలు, ఆశయాలను, క్రమశిక్షణ, దేశభక్తిని ఈనాటి యువత అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సర్దార్ పటేల్ ఆశయాల సాధన కోసం నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే యువత తమ కెరీర్ ను కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకు, విదేశాలకు వెళ్లడానికే పరిమితం చేయడంవల్ల దేశానికి నష్టం జరుగుతోంది. ఆధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్ నెమ్మదిస్తుంది. కుటుంబ రాజకీయ నేపథ్యం పెరుగుతోంది. రాజకీయ నేతల వారసులే మళ్లీ రాజకీయ ప్రతినిధులుగా వస్తూ వారసత్వ రాజకీయాలను పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచ పోటీలో భారత్ వెనుకబడే ప్రమాదముంది. ఉద్యోగాలు, స్కిల్స్ వంటి యువత ఎదుర్కొనే సమస్యలకు ఆశించిన స్థాయిలో పరిష్కారమయ్యే అవకాశాల్లేవు. యవత ప్రాతినిధ్యం లేని నవ భారతాన్ని ఊహించుకోలేం. ఇప్పటికే యువత చాలా మంది తెలిసీ తెలియక డ్రగ్స్, మద్యం, పబ్ కల్చర్ వంటి వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు భారమై తీరని వేదనను మిగిలిస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదంటే చురుకైన యువత రాజకీయాల్లోకి రావాలి. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యా. అందులో 18 మంది తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా అని బండి సంజయ్ వెల్లడించారు.

……………………………………………….
