
* అరుదైన జంతువులు, పక్షుల ప్రాణాలకు ముప్పు
* కాలి బూడిదవుతున్న వృక్షాలు
* పరిసర గ్రామాలను చుట్టేసిన దట్టమైన పొగ
* మంటలు ఆర్పేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు
ఆకేరున్యూస్, తాడ్వాయి (ములుగు జిల్లా) : అడవి తగల బడుతోంది..కిలోమీటర్ల అగ్ని కీలలు వ్యాపిస్తున్నాయి..పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజులుగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం అటవీ ప్రాంతం మంటలతో ఎగిసి పడుతోంది..ప్రతీ వేసవి కాలంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సహజంగానే జరుగుతాయి.. ఈ సారి మాత్రం అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా కనబడుతోందని స్థానికులు అంటున్నారు..
అరుదైన సంపద బూడిదవుతోంది…
దట్టమైన అటవీ ప్రాంతం కావడం తో ఈ అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు, పక్షులు, వృక్షాలు ఉంటాయి.. టేకు, జిట్రేగి, బండారి, ఇప్ప, మద్ది,ఏరు మద్ది లాంటి వృక్షాలు .. అడవి కోళ్లు, నెమళ్ళు ఇతర పక్షులతో పాటు అరుదైన జంతువులు మృత్యువు పాలవుతున్నాయి.. వృక్షాలకు సంబంధించి విత్తనాలుగా మారే పండ్లు, జంతువుల పిల్లలు, పక్షుల గుడ్లు కూడా బూడిదవుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అగ్ని ప్రమాదం జరుగుతున్న ప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ వేగంగా ఆవరిస్తున్న దట్టమైన పొగ వల్ల కూడా జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయని విశ్రాంత అటవీ అధికారి ఒకరు చెప్పారు..
గ్రామాలను చుట్టుముట్టిన దట్టమైన పొగ..
జంతువులు, పక్షులే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉంది.. దట్టమైన పొగ పరిసర గ్రామాలైన తాడ్వాయి, గంగారం, బంజర ఎల్లాపూర్, బంజర తదితర గ్రామాల ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ..వేగంగా వ్యాపించే పొగ వల్ల ఊపిరి తీసుకోలేక పోతున్నామని ప్రజలు చెబుతున్నారు. మంటల నార్పేందుకు అటవీ శాఖ నిరంతరం శ్రమిస్తోంది..ఫైర్ ప్రొటెక్షన్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.. సిబ్బంది కొరత, ఫైర్ సేఫ్టీ కోసం అవసరమైన పరికరాలు తగినంత లేక పోవడం అటవీ శాఖను వేధిస్తోంది.
……………………