
* మేడ్చల్ జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ పట్టణంలో గ్యాస్ పైపులైను నుంచి గ్యాస్ లీక్ (Gas leakage) కావడం కలకలం రేపుతోంది. విభాగాల మధ్య సమన్వయలోపంతో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా కృష్టాపూర్ రోడ్డులోని భాగ్యనగర గ్యాస్ పైపులైను (Bhagyanagar gas pipeline) నుంచి ఈ లీకేజీ మొదలైంది. విద్యుత్ స్తంభం కోసం సిబ్బంది గుంత తవ్వుతుండగా, అడుగు భాగాన ఉన్న గ్యాస్ పైపులైనుకు రంధ్రం పడింది. అప్పటి నుంచీ గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ వాసనలకు స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటుగా వెళ్లే వాహనదారులు సైతం భయం భయంగా ఆ ప్రాంతం దాటుతున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులైను లీకేజీ అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకుండా ఇష్టారీతిన తవ్వకాలు చేపడితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
………………………………………