* రంగంలోకి హేమాహేమీలు
* ఉపఎన్నికపై భారీ అంచనాలు
* ఇప్పటికే చుట్టేసిన కాంగ్రెస్
* వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ ఎస్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఆ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు రాజకీయ వ్యూహాలు సాగుతున్నాయి. అధినాయకులు సైతం రంగంలోకి దిగుతున్నారంటే.. అక్కడ గెలుపును వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతోనే ఉప ఎన్నిక అనివార్యమైంది. అయినప్పటికీ ఆ ఎన్నిక హాట్ టాపిక్ కాలేదు. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రంగంలోకి కేసీఆర్
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అతికొద్ది సందర్భాల్లో మాత్రమే ఆయన తెరపై కనిపిస్తున్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై మాత్రం గులాబీ బాస్ దృష్టి కేంద్రీకరించారు. సిట్టింగ్ స్థానం చేజారిపోకూడదని కేసీఆర్ సైతం రంగంలోకి దిగారు. ఆయన కుమారుడు, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చాలా రోజులుగా వరుస సమావేశాలు, స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నప్పటికీ, కేసీఆర్ ప్రత్యక్షంగా ఇప్పటి వరకు దిగలేదు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. దీంతో తాజాగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగడం ఉత్కంఠను రేపుతోంది.
కీలక సమావేశం
ఎర్రవల్లి లో బీఆర్ ఎస్ కీలక నేతలతో సమావేశమైన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య సునీతకు అవకాశం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థనేతగా మాగంటి గోపీనాథ్ ప్రజల్లో మంచి గుర్తంపు తెచ్చుకున్నారని.. ఆయన నిబద్ధతను పరిశీలించామని కేసీఆర్ తెలిపారు. ఈ అంశాలన్నింటిని గమనించామని.. అలానే ప్రజలకు, పార్టీకి గోపినాథ్ అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆయన భార్యకు ఈ అవకాశం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సునీత గెలుపు కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ స్థానం గెలిచి తీరాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నియోజకర్గంలో డివిజన్లు ఎన్ని, ఎక్కడ ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వంటి వివరాలు అన్నింటినీ కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది.
మంత్రులకు తోడుగా ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, పొన్నం ప్రభాకర్ సహా కీలక నేతలు అందరూ జూబ్లీహిల్స్ లోనే తిష్ట వేశారు. అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాన్స్ దొరికినప్పుడల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. వాటిపై ప్రజల్లో చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నేతలతో సమావేశం అయ్యారు. ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న సందేశాన్ని నేతలకు ఇచ్చారు. జూబ్లీహిల్స్.. కాంగ్రెస్‌కే అనుకూలమని చెబుతూనే ఆచితూచి ఉండాల్సిన విషయాన్ని పేర్కొంటున్నారు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్‌లోనూ బలపడతామంటూ ఉప ఎన్నికలో విజయం ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా విజయపతాకం ఎగురవేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్రేటర్ లో మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయింది.
నవంబర్ 7 లోపే..
అధికారంలో ఉండడం.., సన్న బియ్యం వంటి కీలక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సీటునైనా తమ ఖాతాలో వేసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి సైతం ఉప ఎన్నికపై దృష్టి సారించారు. తాజాగా కేసీఆర్ కూడా గులాబీ నేతలతో సమావేశం నిర్వహించడంతో జూబ్లీహిల్స్.. కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి గా మారిపోయిందనే చర్చ జరుగుతోంది. దీనిపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. బీఆర్ ఎస్ మినహా మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. ఈ తతంగం పూర్తయితే ఉప ఎన్నిక ప్రచారం మరింత జోరందుకోనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. బిహార్ లో నవంబర్ 7 లోపు అసెంబ్లీ ఏర్పడాలి. ఈ క్రమంలో దీపావళి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
……………………………………………………
