* వరంగల్ జిల్లా కోర్టులో స్వచ్ఛభారత్ కార్యక్రమం
* మహాత్ముని కలలను నిజం చేసి చూపించాలి
* వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మలా గీతాంబ
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చీపురు చేతబట్టి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మలా గీతాంబ.. వరంగల్ జిల్లా కోర్టులో ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు సిబ్బంది ప్రతిఒక్కరూ చెత్తను కోర్టు ఆవరణలో వేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ చురుకైన భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించడం, పారిశుద్ధ్యంపైన దృష్టిని కేంద్రీకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక అలవాటుగా మారాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. కోర్టు ఆవరణలో, పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులను నివారించి, ప్రత్యామ్నాయంగా పేపర్ వస్తువులను గానీ, వేరేఇతర వస్తువులను గానీ ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మనీషా శ్రావణ్ ఉన్నమ్, యం.సాయికుమార్, చండీశ్వరీ దేవి, శశి మరియు వరంగల్ కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………