* పేలుతున్న మాటల తూటాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలకు ఇక్కడ గెలుపు కీలకంగా మారింది. మరోవైపు బీజేపీ కూడా ఈ స్థానం కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ టార్గెట్ గానే ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎంఐఎం నుంచి, స్వతంత్రుడిగా గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ టికెట్ ను దక్కించుకున్నారు. అధికార పార్టీ అండ, గతంలో రెండు సార్లు పోటీ చేసిన అనుభవంతో తన గెలుపు సునాయసమని ఆయన భావిస్తున్నారు. మరోవైపు పార్టీ కూడా జూబ్లీహిల్స్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోనే ఉంచి నవీన్ యాదవ్ గెలుపుకోసం కృషి చేయాలని ఆదేశించింది.
హోరాహోరీ పోరు
ప్రస్తుత సమీకరణాలను పరిశీలిస్తే.. బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈక్రమంలో తాజాగా సునీత గెలుపు కోసం తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఆ రౌడీషీటర్ ను ఓడించండి అంటూ పిలుపునిచ్చారు. సునీతను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నోట మరోసారి రౌడీషీటర్ అని రావడంతో నవీన్ యాదవ్ హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలు ఈ టాపిక్ పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఆయనో రౌడీ.. అలాంటి వారిని గెలిపించవద్దని, ఆయనకు ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్లపై ఈ ప్రచారం ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది.
ఫేక్ ప్రచారం అంటున్న నవీన్
రౌడీషీటర్ అంటూ నవీన్ యాదవ్ తండ్రి ఫొటోలు పెట్టి మరీ జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. అయితే ఆ ప్రచారాన్ని నవీన్ తిప్పికొడుతున్నారు. బీఆర్ఎస్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీని కాదు, తమ కుటుంబాన్ని ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారానికి దిగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో తమ కుటుంబానికి టికెట్ ఇస్తామని ఎందుకు హామీ ఇస్తుందని తిరిగి ప్రశ్నిస్తున్నారు. నవీన్‌యాదవ్‌కు ప్రజల్లో, యువతలో ఉన్న పలుకుబడిని చూసి వాళ్లకు ఓటమి భయం పట్టుకుందని చెబుతున్నారు.
గెలుపు అంత ఈజీ కాదా?
తాను క్లీన్ ఈమేజ్ కలిగిన వ్యక్తినని, అదంతా సోషల్‌మీడియా దుష్ప్రచారం అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొట్టి పారేస్తున్నారు. ఎన్నో తప్పులు వాళ్లు చేసి, వాటిని మా కుటుంబంపై రుద్దడం సరికాదని ప్రజలకు నచ్చచెబుతున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మాగంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిపై గెలుపు తనకు సునాయాసమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబం 1978 నుంచి పదవులు లేకుండా ప్రజలకు అండగా నిలబడిందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు. ఎన్నో బస్తీలు, కాలనీల ఏర్పాటులో భాగమయ్యామని, పీజేఆర్‌కు కుడిభుజంగా ఉన్న కుటుంబం తమదని, తమ పలుకుబడి చూసి ఓటమి భయంతోనే దుష్ప్రచారాలు చేస్తున్నాయని అంటున్నారు. ఏది ఎలాగున్నా రౌడీషీటర్ అనే ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాల్సిందే.
……………………………………………………..
