* హడలిపోతున్న విద్యార్థులు
* తల్లీదండ్రుల్లో తీవ్ర ఆందోళన
* కొరవడిన అధికారుల పర్యవేక్షణ
* వరుస ఘటనలపై బండి సంజయ్ సీరియస్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : విద్యార్థిణులపై అరాచకాలు పెరుగుతున్నాయి. వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వంగర ఘటన మరువక ముందే.. గంగాధరలో విద్యార్థిపై వేధింపులు కలకలం రేపాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తాకరాని చోట తాకుతూ.. వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. ఏడాది కాలంగా యాకూబ్ కీచకపర్వం కొనసాగుతోందని తెలిసింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
ఘటన వెలుగు చూసింది ఇలా..
కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్‌పాషా మూడు సంవత్సరాలుగా అంటెండర్‌గా పని చేస్తున్నాడు. జిల్లాలో నిర్వహించే శుక్రవారం సభలో అటెండర్ బాగోతం బయటపడింది. కలెక్టర్ ఆదేశాలతో నెలలో ఒక రోజు శుక్రవారం సభను నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఈ ఘటన వెలుగు చూడడంతో కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నాలుగు రోజులుగా విచారణ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లీదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధ్యులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను విధుల్లో నుంచి తొలగించాలన్నారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి : తల్లీదండ్రులు
విద్యార్థులపై పర్యవేక్షణ కరువైందని తల్లీదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఉంచితే.. సిబ్బంది వేధింపులు తాళలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఇలా పాఠశాలల్లో చదివిస్తే.. అరాచకాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు, ప్రన్సిపాల్కు తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తక్షణం విధుల్లోంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు స్పందించి కఠినంగా శిక్షించాలన్నారు.
బండి సంజయ్ సీరియస్..
గంగాధర పాఠశాలలో చోటు చేసుకున్న విషయంపై కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. హాస్టళ్లలో సరైన వసతులు లేక.. విద్యార్థులు ఉండలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, వసతి గృహాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం, మంత్రులు గొప్పలు చెబుతున్నారని వాపోయారు. యాకూబ్‌పాషాను పోలీసులు అరెస్ట్ చేసి గంగాధర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంటెండర్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
…………………………………………………………………
