* హస్తం పార్టీకి కలిసి వస్తున్న ఉప ఎన్నికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి ఆ నియోజకవర్గం హస్తగతమైంది. ఈ గెలుపు పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. తొలిసారిగా అత్యధిక ఓట్లు, మెజారిటీ ఆ పార్టీ సొంతమయ్యాయి. దాదాపు 50.06 ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పార్టీ.. ఉప ఎన్నికల్లో రాణిస్తోంది. నాడు లాస్య నందిత మృతితో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గ్రేటర్లో తొలి సీటును సొంతం చేసుకుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ హస్తం హవా కొనసాగింది. కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ పార్టీకి ఉప ఎన్నికలు కలిసి వస్తున్నాయి.
వైఎస్ హయాంలో వెలుగులు
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ పార్టీకి ఇక్కడ తిరుగులేదు. ఆ తర్వాత నుంచి హవా తగ్గుతూ వస్తోంది. 2014లో గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయింది. ప్రముఖులు కూడా గెలవలేకపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ పొత్తుతో వివిధ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా ఎల్బీనగర్, మహేశ్వరంలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మూడు లోక్సభ స్థానాలు ఉండగా, ఒకటి కూడా గెలుచుకోలేదు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ సానుభూతిని కూడా పటాపంచలు చేసి నియోజకవర్గంలో జెండాను ఎగురవేసింది.
అప్పుడలా.. ఇప్పుడలా..
దివంగత సాయన్న మృతితో కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె లాస్య నందిత గెలుపొందారు. ఆమె ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మరోసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో ఆమె చెల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్ నిలబడ్డారు. ఆ ఉప ఎన్నికలో గెలిచి గ్రేటర్లో హస్తం పార్టీ ఖాతా తెరిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. జూబ్లీహిల్స్లో అనుసరించింది. కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూత్ల వారిగా సరైన పట్టు లేకపోయిన కానీ అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలుపొందింది.
……………………………………………..
