
* నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
* సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంటున్న బడుల తలుపులు
* ఆటపాటలకు విరామం.. స్కూళ్లకు పయనం
* పాఠశాలలను సిద్ధం చేసిన సర్కారు
* ఈ ఏడాది నుంచి సర్కారు గుడ్ న్యూస్
* ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి ప్రీ ప్రైమరీ విద్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. 49 రోజుల సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. సెలవుల్లో ఆటపాటలతో గడిపిన పిల్లలు మళ్లీ బ్యాగులు భుజాన వేసుకుని బడికి పయనం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న, మొన్నటి వరకు ఇంటి వద్ద ఆటలాడుకుంటూ కాలక్షేపం చేసిన పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు మారాం చేస్తుండడంతో వారిని తల్లిదండ్రులు బుజ్జగిస్తున్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని చాలామంది పిల్లలు బంధువులు, అమ్మమ్మ, నానమ్మ ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో పాఠశాలలు తెరుచుకుంటున్న తరుణంలో కొంతమంది ఇప్పటికే తమ ఇళ్లకు చేరుకోగా, మరికొందరు ఇంకా అక్కడే ఉన్నారు. అయితే వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. క్లాసులకు ఆలస్యంగా హాజరైతే పరీక్షల్లో మంచి మార్కులు రావని చెబుతూ బుజ్జగిస్తూ తీసుకొచ్చే పనిలో పడ్డారు.
26, 287 పాఠశాలలు.. 16,86,343 మంది విద్యార్థులు
2024-25 విద్యా సంవత్సరం ప్రకారం తెలంగాణలో 26, 287 పాఠశాలలు ఉండగా.. 16,86,343 మంది ప్రభుత్వ విద్యార్థులు ఉన్నారు. అదే గతేడాది 26,0897 పాఠశాలలు ఉండగా, 18,06,738 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూళ్లు ప్రారంభమై అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయితే కానీ, కొత్త విద్యా సంవత్సర లెక్కలు తెలియవు. రాజధాని గ్రేటర్ హైదరాబాద్లోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు అందరూ కలిపితే దాదాపు 19.65 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సర్కారు బడుల్లో 3,49,797 మంది విద్యాభ్యాసం చేశారు.
అన్నీ మంచి శకునాలే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న మరుగుదొడ్లు, మంచినీటి, బల్లల సమస్యలను మినహాయిస్తే ఈసారి కొన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈసారి ఉపాధ్యాయుల కొరత లేదని చెప్పవచ్చు. గతేడాది నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియ ద్వారా ఆయా జిల్లాల్లో 45 శాతం మంది కొత్త టీచర్లు చేరడంతో విద్యార్థుల బోధన సమస్యలు తీరనున్నాయి. అలాగే.. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టనుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఇది అమలవుతుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రీ-ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది. తొలి విడతగా 210 ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. అకునూరి మురళి కమిషన్ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇది విద్యార్థుల చేరికను పెంచడంతో పాటు, వెనుకబడిన వర్గాల వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. ఈ విధానం సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడుతుంది.
…………………………………..