– 7 రోజుల్లో 435పై మందిపై కేసులు
– ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే..
– 30 నుంచి 40 ఏళ్లలోపు వారే 154 మంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా మందుబాబులకు కిక్ దిగడం లేదు కదా.. కొందరికి మరింత ఎక్కువ అవుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడు రోజుల్లో 435 మందిపై పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్స్ పెరుగుతున్న కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిత్యం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 435 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో 306 మంది ద్విచక్ర వాహనదారులు, 30 మంది మూడు చక్రాల వాహనదారులు, నాలుగు చక్రాల వాహనదారులు 97 మంది, భారీ వాహనాల డ్రైవర్లు ఇద్దరు చొప్పున మొత్తం 435 కేసులు నమోదయ్యాయి. 21 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న వారే అధికంగా మద్యం సేవించి వాహనాలను నడిపారని, వీరిపై 183 కేసులు నమోదు కాగా, 31 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారిపై 154 కేసులు నమోదు అయ్యాయి.
…………………………………..
