* ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
* సబితా ఇంద్రారెడ్డికి ఊరట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram-mining-case)లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఏ1 బీవీ శ్రీనివాస్ రెడ్డిని, ఏ2 గాలి జనార్దన్ రెడ్డి(Gali JanardhanreddY) ని సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఏ3 వీడీ రాజగోపాల్ రెడ్డిని, ఏ7 కె.మెఫజ్ అలీఖాన్‌ను, కృపానందంను కోర్టు దోషులుగా తేల్చింది. సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy)ని కోర్టు నిర్దోషిగా తేల్చింది. 2022లో ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేసు నుంచి కోర్టు డిశ్చార్జి చేసింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈకేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డితో పాటు అప్పటి మంత్రి, పలువురు సీనియర్ అధికారులు నిందితులుగా ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ ఆలీఖాన్‌ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు ఆలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సీబీఐ కోర్టు(Cbi Court)లో గత నెల వాదనలు పూర్తయ్యాయి. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితుల్లో సబితా ఇంద్రారెడ్డికి మినహా మిగిలిన వారిని దోషులుగా తేల్చింది.
………………………………………………………..
