* బడ్జెట్ వరాలు నిజంగా అందేనా అన్న సందేహాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర బడ్జెట్లో తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో మధ్యతరగతి విద్యార్థులకు కూడా విదేశీ విద్య అవకాశాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను తగ్గించినట్లు చేసిన ప్రకటన కొంత ఊరట ఇస్తుందని భావిస్తున్నారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద టీసీఎస్‌ను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించడం వల్ల అధికశాతం మంది విద్యార్థులు ప్రయోజనం పొందగలరంటున్నారు కన్సల్టెంట్లు.
అవకాశాలు మెరుగు
విదేశీ విద్య మరింత మంది విద్యార్థులకు చేరువయ్యే అవకాశాలూ మెరుగుపడతాయని, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ ట్యూషన్, డిపాజిట్లు, అక్కడ నివాసముండేందుకు చేసే వ్యయాలపై టీసీఎస్ తగ్గడం వల్ల నగదు రోటేట్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు 1,62,500 మంది..
భారతదేశం సంగతి పక్కన పెడితే తెలంగాణా ప్రభుత్వం గత సంవత్సరం 1900 మందికి పైగా విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు తోడ్పడింది. తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే దాదాపు 1,62,500 మంది గత సంవత్సరం విదేశీ విద్య కోసం వెళ్లారు. వీరందరికీ టీసీఎస్ తగ్గింపుతో ప్రయోజనమే కలుగనుందని చెబుతున్నారు కన్సల్టెంట్లు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే విద్యార్థులలో అధిక శాతం మంది మధ్యతరగతి వారే. వారంతా కూడా విద్యా రుణాలను తీసుకోవడమో లేదంటే వ్యక్తిగత పొదుపు, పొలాలను అమ్మడం, చేబదులు తీసుకుని పంపడం చేస్తుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఈ టీసీఎస్ వల్ల కాస్త భారం తగ్గించుకోగలరని కన్సల్టెంట్లు అభిప్రాయ పడుతున్నారు.
పరిమితి అలానే కానీ పన్ను..
ఎల్ఆర్ఎస్ పరిమితిని గత బడ్జెట్లో 10 లక్షల రూపాయలకు పెంచారు. అయితే పన్ను ఐదు శాతం ఉండేది. ఇప్పుడు ఆ 10 లక్షల పరిమితి అలాగే ఉంచి టీసీఎస్‌ను రెండు శాతానికి తగ్గించడం వల్ల కొంతమేర తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుంది. మరీముఖ్యంగా సొంత డబ్బు పెట్టుకుని వెళ్తున్న విద్యార్థులకు ఇది మరింత ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. అధిక మొత్తం డబ్బును ప్రభుత్వం దగ్గరనే దాచి ఆదాయ పన్ను పత్రాలను సమర్పిం , పన్ను రిఫండ్ల కోసం వేచి చూడాల్సిన అవసరం కాస్త తప్పుతుంది. అయితే బడ్జెట్ వరాలు నిజంగా అందేనా అన్న సందేహాలు కొందరు వ్యక్తం అవుతున్నాయి.
……………………………………………………………..
