జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత
* హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి!
* బాలలకు స్నేహపూర్వక గ్రామాల నిర్మాణమే ధ్యేయం
ఆకేరు న్యూస్, ములుగు: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత పిలుపునిచ్చారు. పిల్లలకు స్నేహపూర్వకమైన గ్రామాలను నిర్మించడమే గ్రామ బాలల సభల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామ బాలల సభల్లో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ (Child Helpline) సిబ్బంది పలు కార్యక్రమాలు చేపట్టారు. చిన్నబోయినపల్లి, శివపురం గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ బాలల సభలకు ప్రేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల సంరక్షణ, పోషణ, విద్య, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయి నుంచే సమిష్టి కృషి అవసరమని తెలిపారు. పిల్లలకు ఎలాంటి వివక్ష, హింస, వేధింపులు లేని సురక్షిత వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు.
చిన్నబోయినపల్లి సర్పంచ్ నాగార్జున మాట్లాడుతూ.. బాలల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సదుపాయాలను గ్రామంలో కల్పించి, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తామని తెలిపారు. శివపురం సర్పంచ్ జబ్బ సరోజన మాట్లాడుతూ.. పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాలలు అన్ని రంగాల్లో రాణించేలా గ్రామస్థులందరూ సహకరించాలని కోరారు.
ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్. హరికృష్ణ మాట్లాడుతూ.. చిన్నారులు సురక్షిత స్పర్శ, అసురక్షిత స్పర్శ మధ్య తేడాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగినా, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు.
అనంతరం చిన్నబోయినపల్లి, గోగుపల్లి పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభను అధికారులు అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో రెండు గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

