* 23 నుంచి 28 వరకు సంరక్షణ కేంద్రాల తనిఖీ
* హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
ఆకేరు న్యూస్, హన్మకొండ: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) కనీస ప్రమాణాలు పాటించాలనీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ వెంకట రెడ్డి అన్నారు, శుక్రవారం కలెక్టరెట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమైటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి అధ్యక్షత జరిగింది, ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుచున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. ఈ నెల 23 నుండి 28 వరకు జిల్లాలోని ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ మరియు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలియచేసారు.ఈ లోగా ఆయా సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలకు వారి కనీస ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండాలని, లేనిచో ఇన్స్పెక్షన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రాతిపదికపై తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి మాట్లాడుతూ హెల్త్ ప్రొఫైల్స్ కు సంబంధించిన ఫార్మాట్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో రూపొందించి అన్ని సంస్థలు ఒకే విధంగా హెల్త్ ప్రొఫైల్స్ నిర్వహించుటకు సులువుగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె లలితా దేవి మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల అధికారులకు సమాచారం అందించి బాలల సంరక్షణ కేంద్రాల బాల బాలికలకు హెల్త్ ప్రొఫైల్ నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక,శిశు గృహ మేనేజర్ డి నగేష్, జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ సోషల్ వర్కర్లు జి సునీత, ఎస్ చైతన్య, కౌన్సిలర్ మాధవి, ఓఆర్డబ్ల్యు పి విజయ్ కుమార్, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
……………………….