* 23న ఉత్సవాలు ప్రారంభం
* 28న స్వామి వారి కళ్యాణం
* మార్చి 1న రథోత్సవం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబు చేశారు. ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తేదీతో మూగనున్నాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కార్యనిర్వహణాధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు.
* బ్రహ్మోత్సవ కార్యక్రమాలు…
23న తొలక్కం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.24న ప్రబంధ పారాయణం. 25న పరమపదోత్సవం, అంకురార్పణ. 26న ద్వార తోరణం, దేవత ఆహ్వానం. 27న ఎదుర్కోళ్ళు. 28న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. మార్చి 1వ తేదీన స్వామి వారి రథోత్సవం, 2వ తేదీన ఉత్సవమూర్తుల చక్రస్నానం, పండిత ఆశీర్వాదముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
* స్థల పురాణం…
1400 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి పురాతన దేవాలయం తెలంగాణ రెండో తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనునిత్యం భక్తులతో విలసిల్లుతుంది. పూర్వకాలం వెంకటేశ్వర స్వామి పద్మావతి తో వివాహం జరిగే సందర్భంలో కుబేరుని వద్ద తీసుకున్న అప్పు తీర్చలేక భయము (బుగులు) తో వచ్చి ఇక్కడ ఎత్తైన కొండపై గుహలో తల దాచుకున్నట్లు చరిత్ర చెబుతోంది. పూర్వం కొండపై తపస్సు చేసుకునే మునులు, ఋషులు స్వామివారు పాదం మోపిన గుహ వద్ద పూజలు చేయడమే గాక ఆనాటి పాలకులకు సమాచారాన్ని అందించారు. దాంతో స్థానిక ప్రజలతోపాటు ఆనాటి పాలకులు సైతం గుట్టపై వెలసిన స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసేవారు.
* 14వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం
కొండపై వెలసిన స్వామివారిని కొన్ని పూజలు చేసేందుకు సరైన మార్గం లేని విషయాన్ని గుర్తించిన ఆనాటి పాలకులు 14వ శతాబ్దంలో గుట్టకు క్రింది భాగాన రాళ్లతో ఆలయాన్ని నిర్మించుకున్నారు. అప్పటినుండి దినదినాభివృద్ధి చెందుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు చేరింది. పెరుగుతున్న భక్తుల కోరిక మేరకు స్థానిక పాలకమండలి ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
* 1999లో పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట
జీర్ణావస్థకు చేరిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అప్పటి పాలకమండలి సేకరించిన విరాళాలకు తోడు ఆనాటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కేటాయించిన నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా స్వామివారు ఉత్సవమూర్తులను ప్రతిష్టించారు.
* రెండో తిరుపతిగా చిల్పూర్
శ్రీ స్వామి వారి దర్శనం కోసం అనునిత్యం భక్తుల రాక, దూర ప్రాంతం నుంచి వచ్చేందుకు రవాణా సౌకర్యం, భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి గదులు, కాలక్షేపమంటపం మొదలైన సౌకర్యాలతో పాటు ప్రతి ఆదివారం దేవస్థాన పరిసరాల్లో సంత (అంగడి) నిర్వహిస్తుండడంతో స్థానికులతో పాటు వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావడంతో రెండో తిరుపతిగా పేరు గాంచింది.

* వరంగల్ కు 30 కిలోమీటర్ల దూరంలో
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో కాజీపేట్ జంక్షన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఘన్ పూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి చిన్న పెండ్యాల నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
* బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈనెల 23 నుండి మార్చి రెండో తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఈవో లక్ష్మీప్రసన్న తెలిపారు. రవాణా, త్రాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలతో పాటు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎండ వేడి తగలకుండా చలవ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎనిమిది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
