
* మెగాస్టార్ నివాసంలో చర్చలు
ఆకేరున్యూస్ డెస్క: సినీ కార్మికుల సమ్మె ఇంతవరకు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇండస్ట్రీకి పెద్ద దిక్కయిన మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ (FILM CHAMBER), ఫెడరేషన్ నాయకులు చిరంజీవి (MEGA STAR CHIRANJEEVI) తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ నేపధ్యంలో ఆదివారం చిరంజీవి నివాసంలో ఇరు వర్గాలు కలువనున్నారు. చిరంజీవి అభిప్రాయం తీసుకున్న తరువాత ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులు కూర్చొని చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కార్మికుల డిమాండ్లు నిర్మాతల సమస్యల గురించి చిరంజీవి తెలుసుకున్నారు. టాలీవుడ్ తో పాటు వివిధ రాష్ట్రాల చిత్రపరిశ్రమలో అమలులో ఉన్న నిబంధనలు విధానాల గురించి చిరంజీవి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 4న మొదలైన ఈ సమ్మె ఇంతవరకు పరిష్కారం లభించకపోవడంతో అటు నిర్మాతలు ఇటు కార్మికులు అందోళన చెందుతున్నారు. ఇరు వర్గాలు ఆర్థికంగా నష్టపోతున్నారు. చిరంజీవి కూడా సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ఇరు వర్గాలు కాస్త మెట్టు దిగితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సినీ రంగానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
……………………………………..