
సుప్రీంకోర్టు
* వైద్య విద్యలో ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు
ఆకేరు న్యూస్ డెస్క్ : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ళ స్థానికత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రలు నుండి అభ్యంతరాలు వచ్చాయి. ఇంటర్ మీడియట్ విద్య కోసం ఇతర ప్రాంతల్లో కి వెళ్లి చదివిన వారు ఉన్నారు. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించినవారు ఉన్నారు. మెరుగైన విద్య అందుతుందని ఎంసెట్ పరీక్షల కోసం ఆయా కళాశాలలు మంచి విద్యను అందిస్తాయనే పేరుంది. ఆయా కళాశాలల్లో చదివితే తప్పనిసరిగా సీటు లభించే అవకాశం ఉంటుందని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో చేర్పించారు. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానికతపై తీసుకున్న నిర్ణయం వారికి అడ్డంకిగా మారింది. చిట్టచివరికి ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. వైద్య విద్యను చదువాలంటే తప్పనిసరిగా తెలంగాణలోనే 9వ తరగతి నుంచి 12 వతరగతి వరకు వరుసగా నాలుగేళ్లు చదవాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
…………………………………..