CM REVANTH REDDY ADILABAD MEET
* జూన్ 2 లోపు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం
* రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధిలో రాజీ లేదు
– సీఎం రేవంత్ రెడ్డి
* బాసర క్షేత్రానికి మహర్దశ: ₹225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ.
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్: ఆరు నూరైనా ప్రాణహితను కట్టి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణ హిత చేవెళ్ళను ప్రాజెక్ట్‌ను పక్కకు బెట్టి సొంత లాభం కోసం బీఆర్ ఎస్ పాలకులు కాళేశ్వరం కట్టారు. మూడేండ్లలోపే కాళేశ్వరం కట్టడం అయిపోయింది. అదీ కూలడం అయిపోయింది. అందుకే అదీ కాళేశ్వరం కాదది– కూళేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో డిప్యూటీ సీఎం పాద యాత్ర మూడేళ్ళయిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ₹225 కోట్లతో ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు. గోదావరి మా తలాపునుంచే ప్రవహిస్తున్నా మాకు మాత్రం సాగు , తాగు నీటికి అవకాశం లేదని మా ప్రేమ్ సాగర్ రావు ఎప్పుడూ అంటుంటాడు.. అందుకే చెబుతున్నాను.. ప్రాణహిత చేవెళ్ళను కట్టి తీరుతాం ఆదిలాబాద్ ప్రజల తాగు- సాగునీటి కష్టాలను తీరుస్తామన్నారు.తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌లోని 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని వెల్లడించారు.
* జిల్లాల విభజన ఇప్పట్లో లేదు
ప్రజల నుంచి కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు , జిల్లాల విభజన డిమాండ్ వస్తోందన్నారు. ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు ఎలాంటి సరిహద్దులు మార్చే నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దాని తర్వాతనే ఒక జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
* జూన్ 2 లోపే ఎయిర్ పోర్ట్ పనులు
ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరికైన ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సీఎం కీలక ప్రకటన చేశారు. ఏడాది కాలంలోపే ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు. వీలయితే ఈ జూన్ 2 లోపే ఎయిర్ పోర్ట్ పనులు మొదలు పెడతామన్నారు. జిల్లా అభివృద్ధికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికల తర్వాత అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సానుకూల సంబంధాలను కొనసాగిస్తామని, అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీని ‘పెద్దన్న’గా భావిస్తూ రాష్ట్రానికి రావలసిన నిధులు మరియు మద్దతును కోరతామని తెలిపారు.
ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
—————————

1 thought on “CM REVANTH REDDY | కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది”