*దేవాదుల ప్రాజెక్టు పై నిర్లక్ష్యం…
– దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం పగల్భాలకే పరిమితమైందని, ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన హనుమకొండ బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. దేవాదుల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు .
దేవాదుల ప్రాజెక్టుపై నిర్లక్ష్యం:
బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవన్నపేట పంప్ హౌస్ వద్ద నిద్ర చేస్తామని, మోటార్లు బిగిస్తామని గొప్పలు చెప్పి ఇప్పటి వరకు పత్తా లేరన్నారు.. నేటికీ అక్కడ పరిస్థితి మారలేదని ఎద్దేవా చేశారు. మొన్న హరీష్ రావు గారు పంప్ హౌస్‌ను సందర్శించగానే, భయపడిపోయిన రేవంత్ రెడ్డి నిన్న మొక్కుబడిగా పర్యటించి మాయ మాటలు చెప్పారని విమర్శించారు.
చంద్రబాబు, వైఎస్సార్ బాటలోనే రేవంత్
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను ఎదుర్కోలేక అప్పటి నేతలు చంద్రబాబు, వైఎస్సార్ గాలి మేడలు కట్టారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. 2001లో కేసీఆర్ పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు, 2008లో ఉద్యమం ఉధృతమైనప్పుడు వైఎస్సార్ పైలాన్లకే పరిమితమయ్యారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో 30 వేల ఎకరాలకు భూసేకరణ పూర్తి చేస్తే, కనీసం మిగిలిన 3 వేల ఎకరాలను సేకరించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
ప్రజా ధనం కాంగ్రెస్ పార్టీ కోసమేనా..!
రాష్ట్రంలో రైతులు రైతుబంధు కోసం ఎదురుచూస్తుంటే, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి 1000 కోట్లు వెచ్చిస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పార్టీని పోషించుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
గాలికి పోయిన గ్యారెంటీలు:
వచ్చీ రాగానే ఆరు గ్యారెంటీలంటూ నమ్మబలికిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిందని వినయ్ భాస్కర్ అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గోరీ కట్టడం ఖాయమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు..
ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి , డాక్టర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు..
————————-
