* తెలంగాణ అధికారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ..
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు!!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం హార్వర్డ్ యూనివర్సిటీతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనుంది. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRDI) వేదికగా ఈ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం సూత్రప్రాయంగా అంగీకరించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీఐలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న 271 మంది గ్రూప్-I మరియు 175 మంది గ్రూప్-II అధికారుల ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలు, ఫీల్డ్ విజిట్ అనుభవాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించి, వారిని అభినందించారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయండి. పేదలకు సేవ చేసేటప్పుడు నిరుపేదల పెన్నిధి ఎస్.ఆర్. శంకరన్ ని స్ఫూర్తిగా తీసుకోండి. ప్రభుత్వంలో నిబంధనలు, ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ఏదైనా విషయంలో సందిగ్ధత ఎదురైనప్పుడు ‘కామన్ సెన్స్’ (విచక్షణ) అతిపెద్ద ఆస్తిగా భావించి నిర్ణయాలు తీసుకోండి. చట్టాలు, జీవోలు పది మందికి సహాయం చేయడానికే కానీ, పనులను ఆపడానికి కాదు. 2011 తర్వాత నిలిచిపోయిన గ్రూప్-1 నియామకాలను మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాం. మీ ఎంపికను అడ్డుకోవాలని, మీ కలలను చిదిమేయాలని కొందరు కోర్టులకు వెళ్లారు, కుట్రలు పన్నారు. కానీ ప్రభుత్వం మీ పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసి మీకు నియామక పత్రాలు అందించింది. మీరంతా మెరిట్ ద్వారా వచ్చిన సమర్థులు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించరు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ రాష్ట్రంలో ప్రజా పాలనను 4 కోట్ల మంది ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీపై ఉంది.
ప్రభుత్వానికి మీరే కళ్లు, చెవులు… పాలసీలు ప్రభుత్వం చేసినా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సింది అధికారులే. ముఖ్యమంత్రి అధికారులకు ఒక భావోద్వేగపూరితమైన హెచ్చరిక కూడా చేశారు. మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి మీ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. వారిని విస్మరిస్తే సహించేది లేదు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని అధికారుల జీతాల్లో కొంత భాగాన్ని కోత విధిస్తాం. ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. ఉద్యోగ ప్రస్థానంలో ‘గరం, నరం, బేషరం’ అనే నానుడి ఉంది. కానీ మీరు పదవీ విరమణ చేసే వరకు గరం (నిబద్ధత/గర్వం) గానే ఉండాలి తప్ప ఎక్కడా రాజీ పడకూడదు. 30-35 ఏళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజా సేవయే పరమావధిగా సాగాలి. తెలంగాణ నూతన అధికారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం పాలనా యంత్రాంగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. హార్వర్డ్ వంటి సంస్థలతో సమన్వయం కావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు మరింత సమర్థవంతంగా భాగస్వాములు కానున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

