* ఆడబిడ్డలతోనే.. ఆర్థికాభివృద్ధి..!
* పేదల కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం
* ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్
* ఆడబిడ్డలకు అందిస్తున్న సారె.. ఇందిరమ్మ చీరె..
* బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, కొడంగల్ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ కొడంగల్‌కు వరాల జల్లు కురిపించారు. ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొడంగల్ లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బతికేలా ఉండాలని తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని… తెలంగాణ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్థిక భరోసా కలిపించామన్నారు. నియోజకవర్గంలోని ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెరిగిందని చెప్పారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్..
కొడంగల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని.. ఎడ్యుకేషన్ హబ్‌గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామన్నారు. విద్య ఒక్కటే తరగని ఆస్తి అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువుల కోసం కొడంగల్‌కు వెళ్లాలనేలా ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్ది.. ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ భూములను కృష్ణా జలాలతో తడుపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు . లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను కూడా వినబోతున్నారన్నారు. సిమెంట్ పరిశ్రమలు సైతం ఏర్పాటు కాబోతున్నాయని వివరించారు. అతి తొందర్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

…………………………………………………….
