
* ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
* శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం
* నాసిరకం నిర్మాణం కారణంగానే కూలిందన్న ఆరోపణ
ఆకేరున్యూస్, భద్రాచలం: భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవనంలో పని చేస్తున్న కార్మికుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ రావు పారిపోయాడు. ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. ఈ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
………………………………….