Warangal revenue wards mapping
ఆకేరు న్యూస్, వరంగల్ :
టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ స్థాయి సిబ్బందితో కలిసి మ్యాప్ ఆధారంగా ప్రతి రెవెన్యూ వార్డు సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన హౌజ్ బ్లాక్ లిస్టింగ్ పై సమావేశం నిర్వహించి టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గ్రేటర్ వరంగల్ లోని మొత్తం 67 రెవెన్యూ వార్డుల పరిధిలో ఉన్న గృహ సముదాయాలు పూర్తిగా కవర్ అయ్యే విధంగా సమగ్ర మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ఉండేలా, ప్రతి వార్డుకు సంబంధించిన రెవెన్యూ సిబ్బంది, ఆర్వోలు, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు అందరితో సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు.టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ స్థాయి సిబ్బందితో కలిసి మ్యాప్ ఆధారంగా ప్రతి రెవెన్యూ వార్డు సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలన్నారు. ఈ ప్రక్రియలో ఒక్కో రెవెన్యూ బౌండరీలో ఎన్ని హౌసింగ్ లే అవుట్ బ్లాకులు (HLBs) ఏర్పడుతున్నాయో స్పష్టంగా గుర్తించి, వాటిని సరిగ్గా వర్గీకరించాలని చెప్పారు. బౌండరీలు దాటకుండా, క్లారిటీతో మరియు ఖచ్చితత్వంతో బ్లాకుల విభజన జరగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అలాగే, ఈ ప్రక్రియపై సంబంధిత సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి సందేహాలు లేకుండా పనిని వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియలో పారదర్శకత, సమన్వయం, ఖచ్చితత్వం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
———————————–
