
* కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపణలు
* ఆధారాలతో సహా కేంద్రమంత్రికి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలుగా పని చేస్తున్నారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సివిల్ సప్లయ్ కమిషనర్ డీఎస్ చౌహాన్(DS. CHOWHAN), హైదరాబాద్ కలెక్టర్ హరిచందన(HARICHANDANA)పై గతంలోనే సీఎస్ కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేతలు తాజాగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నేత సురేష్ రెడ్డి (SURESH REDDY)మాట్లాడుతూ.. కొందరు ఐఏఎస్ అధికారులు కనీస బాధ్యతను కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. ఐఏఎస్ అధికారినని మరచిపోయి ప్రభుత్వ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆధారాలతో సహా కేంద్ర మంత్రికి వివరణ ఇచ్చామన్నారు. కొందరు అధికారులు స్థాయిని మరచిపోయి ప్రవర్తిస్తున్నారని మరో నేత బాల్క సుమన్ (BALKA SUMAN) ఆరోపించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నేతలుగా మాట్లాడడాన్ని ఖండించారు. బంజారా హిల్స్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, రాజకీయ విమర్శలు చేసిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చామని, ప్రభుత్వ అధికారులు కలెక్టర్ హరిచందన, సివిల్ సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తమ దగ్గర అధికారిక లెక్కలు పెట్టుకొని కూడా అబద్దాలు ఆడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, రవిచంద్ర, ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఉన్నారు.
……………………………………..