
* ఆందోళన రేకెత్తిస్తున్న కొత్త కేసులు
* కేసులు పెరుగుతుండడంతో కొత్త వ్యాక్సిన్‌కు ఆమోదం..
ఆకేరున్యూస్: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. కొన్ని వారాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడమే కాకుండా చాలాచోట్ల ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరిగింది. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్ కారణమని ఇప్పటి వరకు నిపుణులు ప్రకటించలేదు. కాగా, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పలు ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలలో కోవిడ్-19 కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ మరోసారి వినాశనం కలిగించబోతోందా? కోవిడ్-19 నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనమందరం మునుపటిలాగే చర్యలు తీసుకోవాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ అసలు వేరియంట్ ప్రస్తుతం కనుమరుగైందని.. ప్రస్తుతం సబ్ వేరియంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమేమీ కాదని.. కాలక్రమేణా ప్రజల రోగనిరోధక శక్తి బలహీనపడడం వల్ల వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
……………………………..