
* 2010లో కులగణన చేయలేదు
* సర్వే పేరుతో 5వేల కోట్లు దుర్వినియోగం
* మోదీ నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
* బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
ఆకేరు న్యూస్, డెస్క్ : కులగణనతో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి వేగవంతం అవుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ (DOCTOR LAXMAN) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్రీయంగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు. జనగణనలో కులగణన చేపడుతున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ డిమాండ్ చేసినప్పటికీ 2010లో జనగణనలో కులగణన చేయలేదన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే నిర్వహించిందన్నారు. నాటి సర్వే వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఈ సర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం (CONGRESS GOVERNMENT) రూ.5వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మోసం చేస్తోందని ఆరోపించారు. కంటితుడుపుగా తాము సర్వేలు చేయబోమని స్పష్టం చేశారు. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా కులగణన చేపడతామన్నారు.
………………………………………