
* తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం
* బుల్డోజర్ల కూల్చివేతలపై మౌనంగా ఉందామా..?
* బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
ఆకేరున్యూస్, వరంగల్: ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నాటి కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్పా.. ఏనాడు నోరెతెరిచి కొట్లాడలేదన్నారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా అన్నారు. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం.
బుల్డోజర్ల కూల్చివేతలపై మౌనంగా ఉందామా..?
పేదలు తెలిసీ తెలియక ప్రభుత్వ జాగల్లో గుడిసెలు వేసుకుంటారని.. వరంగల్, హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షలాది మందికి పట్టాలిచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేం చెరువుల్లో పూడికలు తీస్తే వీళ్లెమో హైడ్రా అని పేదల ఇండ్లు కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు చెరువుల పూడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ పేదల ఇండ్లు కూలగొడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. చూసి మౌనంగా ఉందామా..? కొట్లాడుదామా..? అని ప్రశ్నించారు. అలాగే దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ 15వ స్థానానికి కాంగ్రెసోళ్లు తీసుకుపోయారని.. నా కళ్ల ముందే ఇంత మోసం చేస్తారని అనుకోలేదన్నారు. ఇవాళ భూముల ధరలు పడిపోయాయి. ఆలోచన చేయాలి మీరందరూ.. రాజ్యం నడప చేతగాక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని కేసీఆర్ ధ్వజమెత్తారు.
………………………………………….