*నిజామాబాద్ జిల్లాలో ఘోరం..
*కాంగ్రెస్ సీనియర్ నేత ఇమ్మడి గోపీ దారుణ హత్య
ఆకేరు న్యూస్, నిజామాబాద్: జిల్లా రాజకీయాల్లో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో ఢీకొట్టి, అనంతరం కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా పెను కలకలం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలే ఈ రక్తపాతానికి దారితీసినట్లు తెలుస్తోంది.
*ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇందల్వాయి మండలానికి చెందిన ఇమ్మడి గోపీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గురువారం ఆయనపై మేనల్లుడు సతీశ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. తొలుత గోపీని కారుతో బలంగా ఢీకొట్టి కింద పడేశాడు. ఆపై తేరుకునే లోపే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు సతీశ్ హత్య అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
*రాజకీయ వైరం.. ప్రాణాలు తీసే వరకు..
హత్యకు గల కారణాలను పరిశీలిస్తే, మృతుడు గోపీకి నిందితుడు సతీశ్ వరుసకు మేనల్లుడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గ్రామ రాజకీయాల్లో తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా గౌరవరం గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం నుండి ఈ గొడవలు ముదిరాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో గోపీ భార్య, సతీశ్ భార్య ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో గోపీ భార్య విజయం సాధించగా, సతీశ్ భార్య ఓటమి పాలయ్యారు.
ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన సతీశ్, అప్పటి నుండి గోపీపై కక్ష పెంచుకున్నట్లు సమాచారం. గ్రామ ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే పక్కా పథకం ప్రకారం సతీశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
*గ్రామంలో ఉద్రిక్తత – భారీగా మోహరించిన పోలీసులు….
సీనియర్ నాయకుడి హత్యతో గౌరవరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్య వెనుక మరికొందరి హస్తం ఉందా? లేక కేవలం రాజకీయ కక్షలే కారణమా? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
