
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
ఆకేరు న్యూస్, జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. గద్వాల పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే.అరుణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్ఫాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంతో ఎరువుల కొరత ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఎరువులను కృత్రిమంగా కొరత సృష్టించి రైతులను నడిరోడ్డుపై నిలిచేటట్లు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ మంది రైతులు మృత్యువాత పడ్డారని అన్నారు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందించిందని స్పష్టంచేశారు. ఈ విషయంపై చర్చకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఉందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత భావన వస్తుందని, కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బద్నాం చేస్తున్నారని ఆయన అన్నారు. గద్వాల జిల్లా పత్తి సీడ్ హబ్‌గా ఉన్నా, సీడ్ పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతునివ్వడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు భరత్‌కుమార్, బండల వెంకట్రాములు, అప్సర్‌పాషా, రామచంద్రారెడ్డి, స్నిగ్దరెడ్డి, జయశ్రీ, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
……………………………………