congress MLAs demand Konda Surekha Removal
* పార్టీ నుంచీ కూడా తొలగించాలి
* సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్
* గాంధీభవన్ వేదికగా కీలక సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన తీరు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు తన కుమార్తె చేసిన వ్యాఖలతో తనకేం సంబంధం అని కొండా సురేఖ వ్యాఖ్యానించడాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఖండిస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై గాంధీభవన్‌లో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆమె వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సూచించారు.
* ఆమె భాషతో ఎప్పుడూ ఇబ్బందే : వేముల వీరేశం
కొండా సురేఖ మాటలు, వాడే భాష పార్టీని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదని ఆమె ఎలా అంటారని ప్రశ్నించారు. గతంలో ఓ నటి విషయంలోనూ కొండా సురేఖ ఇలానే మాట్లాడి పార్టీ పరువును తీశారని గుర్తు చేశారు. ఆమె మాట్లాడే తప్పుడు భాషకు సీఎం మూల్యం చెల్లించాలా? అని అన్నారు. మీ ఎంటర్టైన్మెంట్కు పార్టీ బలి కావాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం రేవంత్‌ను బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలని, కొండా అంశాన్ని అధిష్ఠానం సీరియస్‌గా పరిగణించాలని అన్నారు. సుస్మిత ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన విమర్శలను సురేఖ వెంటనే ఖండించాలని, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూనే, సురేఖ వాటిని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పార్టీ నుండి కూడా తొలగించాలని అన్నారు.
* బహిరంగ క్షమాపణలు చెప్పాలి : బీర్ల ఐలయ్య
మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని అన్నారు. కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదనడం అత్యంత విడ్డూరంగా ఉందని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సీఎంపై విపక్ష నేతలు విమర్శలు చేస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి తామంతా అండగా ఉన్నామని అన్నారు. సీఎంపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకోబోమని హెచ్చరించారు.
* బహిష్కరించక ముందే వెళ్లిపోండి : ఎమ్మెల్యే నాయిని
కొండా సురేఖ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీని వదిలి పోయారని విమర్శించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఏమైనా చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. బహిష్కరించక ముందే పార్టీ నుంచి వెళ్లిపోండని హితవు పలికారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యేతోనైనా సఖ్యతతో లేదా కలిసి పని చేస్తున్నారా అని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించడం కొండా కుటుంబానికి అలవాటుగా మారిందని విమర్శించారు. పదేళ్ల పాటు విపక్షంలో ఉండి కష్టపడి అధికారాన్ని సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా, సీఎం రేవంత్ రెడ్డిపై కుటుంబ సభ్యులచే విమర్శలు చేయించడం క్రమశిక్షణా రాహిత్యమని స్పష్టం చేశారు.
* ప్రతిపక్షాల కుట్ర అమలు : ఎమ్మెల్యే బాలునాయక్
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలకు కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. కులం, హోదాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కుట్రను సొంత పార్టీ నేతలు అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుకు సాగుతున్న తరుణంలో, సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేయడం తీవ్ర క్రమశిక్షణా రాహిత్యమని తప్పుబట్టారు. మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల బాధ్యత నుంచి తప్పుకోవడమే కాకుండా వాటిని ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని విమర్శించారు. పీసీసీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిని సహించేది లేదని స్పష్టం చేశారు.
* అసలు వివాదం ఏంటీ?
ఇటీవల జరిగిన పరకాల సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిపై తాజాగా కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నాకు పరకాల టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అధిష్టానం నిర్ణయిస్తుంది. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి నేనే పోటీ చేస్తాను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒరిజినల్ కాంగ్రెస్‌లా లేదు. పచ్చ కాంగ్రెస్‌లా మారింది” అని ఆరోపించారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డికి సీఎం అయ్యాక అహంకారం, కళ్లు నెత్తికెక్కాయని, తమ కుటుంబాన్ని అనవసరంగా కెలుకుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడికి చెందిన కంపెనీలకు విలువైన భూకేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ, రూ. 200 కోట్లు ధారాదత్తం చేశారంటూ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం వెనుకబడిన వర్గాలకు చెందినది కాబట్టే లక్ష్యంగా చేసుకుంటున్నారని, తమకు ఊడిగం చేయడం రాదని అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
