
* ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా నిర్మాణాలు
* భూసేకరణకు వెనకాడకుండా రోడ్లు
* అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్ల విస్తరణకు అవసరమైన చోట బూసేకరణ చేపట్టాలని, ధర ఎక్కువైనా వెనక్కి పోవద్దని అన్నారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం అన్నారు. అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
………………………………………….