
* ఓరుగల్లు నుంచి నేడే మరో శంఖారావం
* బాహుబలి వేదికపై నుంచి కేటీఆర్ అంకురార్పణ.. స్పీచ్ కేసీఆర్ ఒక్కరిదే!
* గులాబీ.. సిల్వర్ జూబ్లీ
* ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభ
* తోరణాలు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో వరంగల్ గులాబీమయం
* నాడు వరంగల్‌లోనే సింహ గర్జన
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లో తీవ్ర కసరత్తు, నాయకులతో వరుస సమీక్షలు, అధికార పార్టీ కార్యక్రమాల్లోని లోపాలపై అధ్యయనం చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. నేడు వరంగల్ వేదికగా మరో శంఖారావం పూరించనున్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలకు చేస్తున్నా మౌనంగా ఉన్న గులాబీ బాస్.. నేడు దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమయ్యారు. శ్రేణులను ఉత్సాహపరిచేలా, అధికారకాంక్ష రగిలించేలా మాట్లాడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. గులాబీ రజతోత్సవ సభా వేధికపై కేవలం కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారని సమాచారం. ఇందుకోసం ఆయనే సొంతంగా స్ర్కిప్ట్ రెడీ చేసుకున్నట్లు బీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బాహుబలి వేదికపై నుంచి సభ ప్రారంభసూచనగా కేటీఆర్ అంకురార్పణ చేయగా, కేసీఆర్ ఒక్కరే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
గులాబీ ప్రస్థానం ఇలా..
స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఈ పార్టీ ముఖ్యపాత్ర పోషించింది. 2001 మే 17న కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. ఆ తరువాత 2014లో తెలంగాణలో అధికారం చేపట్టి సుమారు 10ఏళ్లు పాలించింది. అయితే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుకుని 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది.
వరుస ఓటముల నిరుత్సాహం వెళ్లగొట్టేలా..
అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తరువాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. వరుసగా ప్రతి ఎన్నికల్లో ఓటమితో క్యాడర్లో కొన్ని చోట్ల చేజారుతుండగా, మరికొన్ని చోట్ల నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపి.. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకవచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎల్కతుర్తి వేదికగా..
నేటి సాయంత్రం 4.30గంటలకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద జరిగే భారీ బహిరంగసభ కోసం 1,216 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 169ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా.. మిగిలిన స్థలంలో పార్కింగ్ తదితర ఏర్పాట్లకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపి, పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా ఎల్కతుర్తిలో సభ నిర్వహిస్తున్న గులాబీ నేతలు భారీ జనసమీకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, పాదయాత్రలతో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు సభకు బయలుదేరటంతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. లక్షలాది మందితో జరిగే సభా ప్రాంగణం నుంచి కేసీఆర్ తనదైన శైలిలో పదునైన వాగ్దాటితో అధికార పార్టీకి చెమటలు పట్టేలా, సొంత పార్టీకి జవసత్వాలు వచ్చేలా ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు.
……………………………………